Saturday, April 21, 2018

గురునానక్


గురునానక్




సాహితీమిత్రులారా!

గురునానక్ సిక్కులకు మొదటి గురువు. ఈయన పంజాబ్ లోని తల్వండీ 
అనే గ్రామంలో కార్తీక పౌర్ణమినాడు జన్మించారు.
తండ్రి పేరు కాలూరామ్ వేదీ. చిన్నతనంలో పండిత్ బ్రజనాథ్,
మౌలానా కుతుబుద్దీల నుండి విద్యను అభ్యసించారు. 18 ఏళ్ళ 
వయసులో సులక్షణాదేవితో వివాహం అయింది. వీరికి  శ్రీచంద్, 
లక్ష్మీచంద్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. నానక్ బాల్యం 
నుండి సాధు స్వభావం,వైరాగ్య ప్రవృత్తి కలవారు. ఈయన దేశ విదేశాల్లో 
5 సార్లు యాత్రలు చేసి ఎందరో జైన సాధువుల్ని, ముసల్మాను ఫకీర్లను, 
యోగులను కలుసుకున్నాడు. పంజాబీ, హిందీ, ఫారసీ, సంస్కృతాల్లో 
మంచి పాండిత్యం కలవారు. అయితే ఇవేవీ ఈయన కూర్చొని 
అభ్యసించినవికావు. కేవలం అనుభవం మీద, నలుగురితో పరిచయాలవల్ల 
సమకూరినవి. ఈయన నిర్గుణ బ్రహ్మోపాసకుడు. అవతారాలు, విగ్రహారాధన, 
కులగోత్రాలు, పేదగొప్ప తారతమ్యాలు ఇలాంటి విషయాల నెన్నిటినో వ్యతిరేకించారు.
హిందూ ముస్లిమ్ల ఐక్యతకోసం పాటుపడిన వ్యక్తి. రెండు మతాల్లోని చెడునూ విప్పి చెప్పినప్పటికి ఈయన సూక్తులు అన్నీ సులభంగా జనసామాన్యానికి అర్థమయేటట్లు ఉంటాయి.  మిగిలిన నిర్గుణోపాసకులలాగ స్త్రీలను నానక్ నిందించలేదు. గురునానక్ రచనలు జపుజీ, సిద్ధగోష్ఠి, రాగ్ అసావేరి, శబ్ద్, అష్టపదియా, శ్లోక్ వంటివి పదిహేనున్నాయి. తన రచనల్లో నానక్ నామాన్ని జపించటంలోని మాహాత్మ్యం, స్వార్జితంలోని మాధుర్యంతోపాటు
తనకున్నది పదిమందికి పంచిపెట్టి తినటంలోని గొప్పదనం వంటి
విషయాల్ని ప్రతిపాదించాడు. వేదాల, షట్ - శాస్త్రాల, ఉపనిషత్తుల,
పురాణాల జ్ఙానంతో, సారంతో ఈయన రచనలు నిండి ఉన్నాయి.
ఓం - కారానికి అత్యద్భుతమైన వ్యాఖ్య చేసిన మహానుభావుడు. ఈయన
కావ్యభాష ప్రధానంగా వ్రజభాష, సంస్కృతం, అరబీ, ఫారసీ, పంజాబీ, 
ఖడీబోలీ, సింధీ, ముల్తానీ భాషా శబ్దాలు ఎక్కువ సంఖ్యలో ఉపయోగించారు. 
ఎక్కువ సంఖ్యలో ఉపమాన, రూపకాలంకారాలను
అక్కడక్కడా అన్యోక్తి ప్రయోగించాడు. ఈయన పదాలన్నీ గౌడి, గూర్జరి,
ధనశ్రీ, తిలంగ, బలావల్, రామ్ కవీ, వసంత, సారంగ, మల్హర్ మొదలైన రాగాల్లో రచించబడ్డాయి. నానక్ వాణిలో భక్తి, జ్ఙాన, వైరాగ్యాలతో బాటు ఆనాటి, రాజకీయ, సామాజిక, ధార్మిక, పరిస్థితులను తెలుసుకోడానికి ఉపయోగపడే చక్కటి వర్ణనలూ ఉన్నాయి. ఋతువర్ణన హృదయంగమం. సిక్కుమత స్థాపకుడే కాక ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండించి, దేశ సమైక్యతకోసం పాటుపడిన ధన్యజీవి నానక్. ఈయన కర్తార్ పూర్ లో తనువు
చాలించారు.

No comments:

Post a Comment