Wednesday, February 21, 2018

శృంగార చేష్టలు అంటే--------------1


శృంగార చేష్టలు అంటే--------------1
సాహితీమిత్రులారా!

యౌవనం వల్ల కలిగిన హావభావాలు మొదలైన వాటివల్ల
నాయికా నాయకులకు కలిగే చేష్టలనే శృగార చేష్టలంటారు.
వాటిని గురించిన కొన్ని విషయాలను ఇక్కడ చూద్దాం-
ఇవి మనసువల్ల పుట్టేవి, అప్రయత్నంగా పుట్టేవి,
స్వభావాలవల్ల పుట్టేవి అని మూడురకాలు.   

మనసు వల్ల పుట్టేవి - 3
1. భావం, 2. హావం, 3. హేల
భావం -
ఏ వికారములేని మనసులో మొట్టమొదటిసారి 
కలిగిన వికారంను భావం అంటారు.

హావం- 
భ్రూనేత్రాది వికారాలచే సంభోగేచ్ఛను తెలిపే భావమే
అల్పంగా పైకి కనపడే వికారాన్ని హావం అంటాము/ 
భావాన్ని కొద్దిగా వ్యక్తం చేయటాన్ని హావం అంటారు.

హేల- 
హావంలో వ్యక్తమైన వికారమే సువ్యక్తమైతే 
అది హేల అని పిలువ బడుతుంది.

అప్రయత్నంగా పుట్టే శృంగార చేష్టలు - 7
1. శోభ, 2. కాంతి, 3. దీప్తి, 4. మాధుర్యం,
5. ప్రగల్భత, 6. ఔదార్యం, 7. ధైర్యం.
పై చెప్పిన రెండు విధాల శృంగార(10)చేష్టలు
స్త్రీ, పురుషులకు ఇద్దరికి కలుగుతాయి.

స్వభావం వల్ల కలిగే శృంగార చేష్టలు - 18
ఇవి కేవలం స్త్రీలకు సంబంధించిన శృంగార చేష్టలు.
1. లీల-
చేష్టలతో, వేషాలతో, భూషణాలతో, ప్రేమ మాటలతో,
ప్రియుణ్ణి అనుకరించడానికే లీల అని పేరు.
2. విలాసం -
ఇష్టమైన వారిని చూడటంతో నడకలో, ఉనికిలో, కూర్చోవడంలో
మాట్లాడడంలో, చూడటంలో మొదలైన పనుల్లో కనబడే విశేషమే విలాసం.
3. మాధుర్యం -
ఏ అవస్థలో ఉన్నా, ఎలావున్నా రమణీయంగా 
కనబడటమే మాధుర్యం.

4. ధైర్యం -
ఆత్మశ్లాఘలేని అచంచలమైన మనోవృత్తినే ధైర్యం అంటారు.

5. విభ్రమం - 
ప్రియుడు రావడంతో కలిగిన హర్షరాగాదువల్ల తొందరతో
భూషణాదులు తారుమారుగా ధరించటం విభ్రమం

6. కిలికించితం -
ప్రియసంగమ హర్షం వల్ల  కలిగిన స్మిత శుష్కరుదిత,
హసిత త్రాస క్రోధ శ్రమ మొదలైన వాటి సాంకర్యమే
కిలికించితం.

7. మోట్టాయితం -
ప్రియునితో రతిక్రీడల్లో తేలాలి అనే మనసు కలిగినపుడు
అతని కథలు విని చేసే కర్ణకండూయనాదికమైన చేష్టనే
మోట్టాయితం అంటారు.

Tuesday, February 20, 2018

గుణాఢ్యుడు - బృహత్కథ


గుణాఢ్యుడు - బృహత్కథ
సాహితీమిత్రులారా!


సంస్కృతంలో వెలసిన కథాకావ్యాలలో
గుణాఢ్యుని బృహత్కథ చెప్పదగింది.
ఇది వెలసిన తరువాత అనేక కవులకు
కావ్యనాటకాలకు ఇతివృత్తాలను సమకూర్చింది.
సంస్కృత సాహిత్యంలో వ్యాస, వాల్మీకుల సరసన
పేర్కొనదగినవాడు గుణాఢ్యాడు. బృహత్కథ సంస్కృతంలో
కూర్చబడలేదు. దానికి గల కారణం తెలిపే ఒక ఒకకథ
ప్రచారంలో ఉంది. ఆ కథ........
             శాతవాహనరాజు ఒకసారి రాణితో జల విహారం చేస్తూండగా 
ఆమె "మోదకైస్తాడయ(నీళ్లతో నన్ను కొట్టకు)"
అనగా రాజు పొరపాటుగా అర్థం చేసుకొని మోదకాలను
(లడ్డూలను) తెప్పించి రాణి మీదికి విసరసాగాడు.
రాజుకు సంస్కృతం రానందున రాణి పరిహాసమాడింది.
రాజు ఆస్థానంలో ఉన్న గుణాఢ్యుడు ఆరుసంవత్సరాల్లో
ఆయనకు సంస్కృతం నేర్పుతానన్నాడు. ఆ ఆస్థానంలోనే
ఉన్న శర్వవర్మ తానైతే ఆరు నెలల్లోనే నేర్పుతానన్నాడు.
దానికి గుణాఢ్యుడు అలా నేర్పగలిగే పక్షంలో నేను సంస్కృత
ప్రాకృత దేశభాషలను త్యజిస్తాను అని శబథం చేశాడు.
శర్వవర్మ ప్రత్యేకంగా కాతంత్రవ్యాకరణాన్ని రచించి తాను చెప్పిన
 ప్రకారం 6 నెలల్లో రాజుకు సంస్కృతం నేర్పాడు. తాను చేసిన
శపథం ప్రకారం గుణాఢ్యుడు సంస్కృత ప్రాకృతాలను వదలివేశాడు.
అందుకే పైశాచిక భాషలో బృహత్కథ వ్రాశాడు.

                                         దీనిలోని కథలో చివరిభాగం మాత్రమే
మనకు లభ్యమౌతూంది. దీనికి ఒక కథ చెప్పబడుతూంది.
శపథ ప్రకారం గుణాఢ్యుడు ఆ భాషలను వదలివేసి రాజాస్థానం
నుండికూడ వెళ్ళాడు. తర్వాత బృహత్కథను వ్రాసికొని రాజుకు
ఇవ్వాలని వెళ్ళగా  తీసుకొని కొందరు పండితులకిచ్చి చదివి
వారి అభిప్రాయం చెప్పమన్నాడు. వారు అది అంత గొప్ప
పుస్తకం కాదని ఈర్ష్యతో చెప్పగా రాజు దాన్ని గుణాఢ్యునికి వెనక్కు
ఇవ్వమని పంపేశాడు. దానికి బాధపడి గుణాఢ్యుడు అది తీసుకొని వెళ్ళాడు.
రాజుగారి భోజనంలో ఏరుచీలేని మాంసం వంటవాడు వడ్జిస్తున్నాడు.
దానికి రాజు నిలదీసి అడగ్గా దానికి వంటవాడు. రాజా అడవిలో
జంతువులన్నీ ఒక దగ్గరే కూర్చోని ఆహారంలేకుండా ఉన్నాయి.
అక్కడ ఒకాయన మంటచేసి అందులో ఏదో చదువుతూ
చదివిన తాళపత్రాన్ని అందులో వేసేస్తున్నాడు. ఆయన చుట్టూ
జంతువులన్నీ వున్నాయి అని చెప్పగా రాజు ఆశ్చర్యంతో అక్కడికి
వెళ్ళి చూడగా అక్కడ గుణాఢ్యుడే అది చదివి అందులో
వేస్తున్నాడని గమనించి తానెంత పొరపడ్డానో అర్థమై ఆయన్ను
ప్రాథేయపడి అక్కడినుండి పిలుచుకు వెళ్ళాడట. ఆ మిగిలిన కథే
ఇప్పుడు మనకున్న బృహత్కథ.
దీన్ని బుద్ధస్వామి బృహత్కథాశ్లోక సంగ్రహ అని,
క్షేమేంద్రుడు బృహత్కథామంజరి అని,
సోమదేవుడు కథాసరిత్సాగరం అని
సంస్కృతంలోనికి అనువదించారు.

Monday, February 19, 2018

విద్యున్మాలికలు


విద్యున్మాలికలు
సాహితీమిత్రులారా!


శ్రీ.శ్రీ. గారి ప్రభవ నుండి
విద్యున్మాలికలు అనే ఈ కవిత చూడండి-

బారులు బారులుగా తీరిన
మబ్బు గుబ్బలుల దారుల
దారి తప్పి చరించె
ఆ రేయి తరళ సరళేరమ్మదములు
అవి కవిడెంబమంబు గగురుపొడిచి
ఓరగా,
కోకిలపాట జీరగా
పైరుల పైపయి సోకి చను
తూరుపు గాలి
తీరుగా కవిడెందమున 
తాకి తాకనటుల తరలిపోయిన 
ఏ పిన్న భావాలొ
భావంపు సిగ్గు తడియారక
నుడిలో విడుదల వడ జాలక
విహ్వలించు
ఏ పిన్న భావాల పరిమళ తరంగాలొ
ఆనాటి చకచకిత చంచలావితతి

స్వర్గ వీథీవిహార తారకలు మారి
శాపవశాన,
మానవునితోట మడికట్లలోన
ప్రవాసపు బ్రతుకుతోన
నవయుచుండియు నవ్వు వెల్లువల జల్లు
రకరకాల రంగుల వికచ లతాంత సంతతులుగ
వినువీథి మీద


తమ కోరికల తోడ  పరిపూతములైన
కనుల కాంతి  వినయ విసృమతరలేమొ
ఆ నాటి రేయి నవఘళించిన
శంపాసహస్ర 
నిశావిశాల కుహర విహారములు

అవి యేమొ
యామినీవినీల గేహదేహళీ
విష్ణు క్రాంత నితాంత తోరణములొ
ఆటలాడు వేలుపు బాలికల
పావడా అంచుల బంగారు తీవియలొ
కావవి
వేటకాని కోలలకు కూలి 
వేదనల తూలు హరిణాల కండ్లు 
జాలికి పురుటిండ్లు -
దిక్కు దిక్కుల కంపిన దీనంపు చూడ్కులే
ఆనాటి
ప్రళయ తాండవ భయంకర సౌదామినులు

- ముద్రణ - భారతి (మార్చి- 1933)

Sunday, February 18, 2018

అయ్యలరాజుగారి సీతాలావణ్యం


అయ్యలరాజుగారి సీతాలావణ్యంసాహితీమిత్రులారా!"అయ్యలరాజు రామభద్రు"ని "రామాభ్యుదయం"లో
ఆయన "సీత"ను వర్ణించిన తీరు ఇక్కడ చూద్దాం-

కళ వెచ్చఁబోని నిర్మలచంద్రబింబంబు
         పరభృతం ూంటని సరసకిసల
మినకరవ్యాప్తి వాడని కమ్మపూఁదీవ
         మరుఁడేర్చి దాఁచిన మార్గణంబు
లఁటిచూడని మించుటద్దంపుఁ బలకలు
         కొదమ రాయంచ మార్కొనని తూండ్లు
వలరాచయాఁకఁ బాటిలు మ్రానిక్రొంబండ్లు
         కానంగరాని శృంగారసరసి
యనఁ బుడమి ముద్దరాలి నెయ్యంపుఁజూలి
ముద్దు నెమ్మోము మించు కెమ్మోవి మేను
కలికిచూపులు తళుకుఁ జెక్కులు భుజంబు
లుదుటుఁ జనుగవయును నాభియును దనర్చు

ఆ సీత ముఖం కళలు తరని చంద్రబింబం.
కెమ్మోవి కోకిలముట్టని మావిడిచిగురు.
శరీరం సూర్యకిరణాలచే వాడని పూతీగ.
చూపులు మన్మథుడు మంచివిగా ఏర్పరచి
దాచిపెట్టిన బాణాలు. చెక్కిళ్ళు మించుటద్దములు.
భుజాలు తామరతూండ్లు, నాభికనిపించని శృంగార సరసి.

ఎలఁదీవఁబోడి జానకి
కలభాషిణి యలరురూపు కలిమిం గడు రం
జిలు శరథి వెడలి వెలిఁగెడు
నల చక్కెవింటివాని యమ్మో యనఁగాన్

లేతతీగవలె మనోహరమైన శరీరంకలది.
అవ్యక్తమధురమైన పల్కులు కలది.
పుష్పమువలె కోమలమైన రూపంతో
ఒప్పే సీత సముద్రం నుండి బయటికి
వచ్చిన లక్ష్మిదేవియా లేక మన్మథబాణమా
అన్నట్లు ఒప్పుచున్నది - అని భావం.

తుమ్మెదకంటు పూమొగడతోఁ దులఁదూగు లతాంగి ముక్కునె
త్తమ్మికి జాతిదాయ వనితాజనతామణిమోము కంతు క్రొ
త్తమ్ములతమ్ము లిందుకళికాలిక వాలిక పూపుఁ గోపు ల
క్కొమ్మకు సావిమావిసెలగొమ్మకు సాటియె బోటు లెయ్యె డన్

ఆ సీత ముక్కు సంపెంగపూవును పోలివున్నది.
ముఖం కమలాలన్నిటిని శత్రువులాంటిది.
చూపులు మన్మథ బాణాలు. ఆ తరుణికి
సాటిరాగల స్త్రీల లోకంలో ఎక్కడా లేదు
- అని భావం

కమలంబు మోము కన్నులు
కమలంబులు కేలుఁగవయుఁ గమలము లడుగుల్
కమలంబులు నిలువెల్లను
గమలాకృతి మించె బుడమి కన్నియ బళిరే

ఆ కన్నె మొగం కమలాలవలె ఉన్నాయి.
కనులు కమలాలను పోలి ఉన్నాయి.
చేతులు కమలాలవలనే ఉన్నాయి.
పాదాలు కమలాలట్లే ఉన్నాయి.
ఇన్నిమాటలెందుకు ఆపాదమస్తకం
ఆ ఇంతి ఆకారం కమలాకారమే అంటే
లక్ష్మీరూపం అని భావం.

ఆకరియానవేలి యనంతవిలాసము మాధవోదయం
బాకమలాయతాక్షిమధురాధరసీమ హరిప్రకార మా
కోకిలవాణి మధ్యమునఁ గూడిన దింతయు కాదు తాను రా
మాకృతి దాల్చె నీచెలువమంతయు నాయమయందుఁ జొప్పడున్

రామచంద్రా ఆమె ఏనుగు వంటి నడక కలది.
సీత జడ అనంతుని(సర్పరాజైన ఆదిశేషుని) వలె ఉన్నది.
ఆమె పెదవి మాధవుని(వసంత)కాలంలోని చిగురువలె ఎఱ్ఱగా
ఉన్నది. ఆమె నడుము హరి(సింహం)వలె ఉన్నది.
ఈ ఉపమానాలన్నీ (అనంతుడు, మాధవుడు, హరి) విష్ణువుకు
పర్యాయపదాలే. ఆ విష్ణువు నీవే. కావున నీ లక్షణాలన్నీ
ఆమెలో చేరి ఉన్నాయి. అంతేకాదు ఆమె రామ(స్త్రీ) రూపము
దాల్చి నీ సౌందర్యమునంతా కలిగి ఉన్నది - అని భావం.

జొక్కపుఁ బసిండి నక్కులఁ జెక్కుఁ జెక్కు
లక్కలికికొప్పు నాలాంబుముక్కు ముక్కు
కనకగంధఫలీసారకంబు కంబు
కలిత రేఖావిలాసమంగళము గళము

ఆ కలికి చెక్కిళ్ళు బంగారాన్ని మించిన మెఱుస్తున్నాయి
కొప్పు మేఘాన్ని పోలి ఉంది ముక్కు బంగారపు సంపెగపూవు
వలె ఉంది. మెడ శంఖం మాదిరి ఉంది - అని భావం.

Saturday, February 17, 2018

సీతాయన - వైద్యనాథ్ మాలిక్


సీతాయన - వైద్యనాథ్ మాలిక్
సాహితీమిత్రులారా!


రామాయణం విన్నాం గాని సీతాయన ఏమిటి అంటే
దాని రచయిత వివరాలు చూద్దాం-

వైద్యనాథ్ మాలిక్, విధు ప్రముఖమైథిలి పండితుడు.
ఈయన బీహార్ లోని మధుబని జిల్లా విరౌల్ గ్రామంలో
1912వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని రచనలు
1934లో వచ్చిన భూకంపంలో పోయాయి. 
పద్యాలు పత్రికల్లో వచ్చాయి. హిందీ, మైథిలి భాషల్లో 
చాల పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. 
చాలా వృత్తులు చేపట్టినా చివరకు పూర్వపు దర్భంగా 
రాజ్యంలోని రాజ్ నగర్ లో మేనేజరుగా పదవీవిరమణ చేశారు.

1976లో సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సీతాయన
ఈయన ముద్రిత రచనలలో మొదటిది. ఇది 7 సర్గల
ఇతిహాస కావ్యం. ఇది రచించటానికి ఈయనకు 
11 సంవత్సరాల సమయం పట్టింది. ప్రతిసర్గలోను
మళ్ళీ 7 ఉపసర్గలున్నాయి. కవి దీన్ని సప్తసర్గి సుమన్ అన్నాడు.
ఉదాత్త పాత్రలు, ధారాశుద్ధిగల శైలి, ఇతివృత్త నిర్వహణ
నైపుణ్యం గల సీతాయన మైథిలి సాహిత్యంలో విశిష్టరచన.

మొదటి సర్గలో - 
మిథిలా వర్ణన, సాంఘిక ఆచారాలు, పద్ధతులు,
సీతను ఆది శక్తిగా చెప్పటం, ఆమె భూప్రవేశం,
జనకుడు శ్రయజ్ఞ నిర్వహణకు నిశ్చయించుకోవటం,
సీతావతార జననం, మొదలైనవి ఉన్నాయి.

రెండవ సర్గలో -
సీతా బాలికాలీలలు

మూడవ సర్గలో-
సీతావివాహం

నాలుగవ సర్గలో -
సీత వనవాసాగమనం

ఐదవ సర్గలో -
సీతాపహరణం

ఆరో సర్గలో -
అగ్ని పరీక్ష

ఏడవ సర్గలో-
ధరణిప్రవేశం

ఈ విధంగా కూర్చారు వైద్యనాథ్ మాలిక్ గారు

రామాయణం వంటిదే సీతాయణ
సీతను మహామాయగా, ఆదిశక్తిగా 
కవి చిత్రించాడు. సంస్కృత సాహిత్య 
విమర్శకులు ఇతిహాసానికి నిర్ణయించిన
అన్ని లక్షణాలు దీనికున్నాయి.
పటిష్టమైన పదబంధాలు, స్పష్టమైన అభివ్యక్తి, 
విస్తార వర్ణన, ధారాశుద్ధి గల శైలితో ఈ కావ్యం
సహృదయ రంజకంగా ఉంటుంది.

( ఆధారం- విజ్ఞాన సర్వస్వం - 6, భారతభారతి పుట. 947)


Friday, February 16, 2018

వచనం వికాస ప్రారంభం


వచనం వికాస ప్రారంభం
సాహితీమిత్రులారా!
వచనం దానివికాసం గురించి అది ప్రారంభంలో
ఎలా ఉన్నది తెలిపే ప్రయత్నం-
తెలుగులో మొదట అచ్చైన పుస్తకం 1746లో
అదీ నూరు జ్ఞానవచనాలు దీన్ని రెవరెండ్ బెంజిమన్
షుల్జ్ ముద్రించాడు. దీనితో తెలుగు ముద్రణా యుగం 
ప్రారంభమైంది. ఇది వచన పుస్తకం. అంటే తెలుగులో 
మొదట ముద్రించబడిన పుస్తకం వచనంలోనే. 
పాశ్చాత్యులు తమ మతప్రచారంకోసం మొదలు పెట్టిన
ముద్రణ మన సాహిత్యానికి ఎంతో మేలు చేసిందనవచ్చు.
అదీనూ వచనానికి. దీనితో మరీ అభివృద్ధి చెందింది.
తెలుగురాని తెలుగేతరులకోసం వ్యాకరణ పుస్తకాలను 
1814లో డా. క్యారీ దొరగారు ముద్రించారు. అలాగే
1816లో ఏ.డి.కాంబెల్, 1817లో సి.పి.బ్రౌన్ తెలుగు 
వ్యాకరణాలను ముద్రించారు. ఇవన్నా వచనంలోనివే.
          1912లో ఫోర్ట్ సెంటు జార్జి కళాశాలను స్థాపించి
తెలుగు వచనబోధనకు పుస్తకాలు లేనందున ఆ కళాశాలలో 
ప్రధానాధ్యాపకులుగా ఉన్న రావిపాటి గురుమూర్తి శాస్త్రి
1819లో ద్వాత్రింశత్సాలభంజికల కథలు (విక్రమాదిత్యుని కథలు)
1834లో పంచతంత్రకథలు, 1836లో వ్యాకరణ పుస్తకాలను
చక్కని వ్యావహారిక భాషలో వ్రాయబడి అనేకమార్లు 
ముద్రింపబడినాయి.
తరువాత 
పాటూరి రామస్వామి - శుకసప్తతికథలు(1840)
పాటూరి నరసింహశాస్త్రి - హరిశ్చంద్రునికథ(1840)
పాటూరి రంగశాస్త్రులు - చేమకూరవారి విజయవిలాసము(1841)
టి.రాఘవాచార్యులు - నలచరిత్ర(1841)
ధూర్జటి లక్ష్మీపతి - హంసవింశతి(1842)
దిలారామకథలు, భూగోళదీపికలు(1843)
భేతాళ పంచవింశతి (1848)
ఈ విధంగా వచనంలో అదీను వ్యాహారిక భాషలో
1855 వరకు అచ్చులో రావడం మొదలుపెట్టాయి.

Thursday, February 15, 2018

దృగ్భీత్యా నరసక్షమాపతిసభ


దృగ్భీత్యా నరసక్షమాపతిసభ
సాహితీమిత్రులారా!
శ్రీకృష్ణదేవరాలవిఖ్యాతిని గురించిన
సంస్కృతంలో చెప్పబడిన చాటువు-

దృగ్భీత్యా నరసక్షమాపతిసభ స్త్రీణాం మృగేణాశ్రితో 
రాజా తన్ముఖతర్జిత స్స్వయ మపి త్యక్త్వాత్మనో మండ లమ్
దుర్గేశస్య జటాటవీ ముపగతః పాణౌ త మేణం దదౌ
సన్మార్గప్రవణో నిజాశ్రితతమం క్షీణోపి నోపేక్షతే
(చాటుపద్యమణిమంజరి - పుట - 165 - ప.419)

నరసరాజుకుమారుడైన శ్రీకృష్ణదేవరాయల స్త్రీలచూపుల
భయంచేత లేడి చంద్రుణ్ణి ఆశ్రయించింది. అయితే
ఆ చంద్రుడు కూడ వారిముఖాలచే భయపెట్టబడి,
తన (చంద్ర)మండలం  వదలి శివుని జటాజూటాటవిని
చేరినాడు. చేరి ఆ లేడిని శివుని చేతికిచ్చాడు.
సన్మార్గము(మంచిమార్గం/ ఆకాశమార్గం)నందు
ఆసక్తికలవాడు ఎంతటి క్షీణదశలో ఉన్నా తనను
ఆశ్రయించినవారిని ఉపేక్షించడు కదా - అని భావం.